ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోకసభ సభ్యుడు, టీడీపి అభ్యర్థి గల్లా జయదేవ్‌ ఇల్లు, కార్యాలయాలపై తాము దాడులు చేసినట్టు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టత ఇచ్చింది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోకసభ సభ్యుడు, టీడీపి అభ్యర్థి గల్లా జయదేవ్‌ ఇల్లు, కార్యాలయాలపై తాము దాడులు చేసినట్టు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టత ఇచ్చింది. గల్లా అకౌంటెంట్‌ గుర్రప్పనాయుడు ఇంట్లో మాత్రమే మంగళవారం తాము సోదాలు చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

తాము సోదాలు నిర్వహించిన సమయంలో లెక్కలు చూపని రూ.45.4 లక్షలను తాము స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు గుర్రప్పనాయుడు ఇంట్లో భారీగా నగదు దాచారనే ఆరోపణపై టోల్‌ ఫ్రీ నెంబరు నుంచి తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్టు వివరించింది. 

ఎంపీ గల్లా కార్యాలయంలో గానీ, ఇంట్లో గానీ తాము ఎలాంటి దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది. తమ ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారనే ఆరోపణపై గల్లా జయదేవ్ తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.