అనంతపురం: హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాజీ పోలీస్ అధికారి వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు రూట్ క్లియర్ అయ్యింది. ఏపీ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చునని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

గోరంట్ల మాధవ్ నామినేషన్ పై ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇకపోతే  గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ తీసుకునే విషయంలో ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రెండు చార్జ్ మెమోలు పెండింగ్‌లో ఉన్నందునే మాధవ్ వీఆర్ఎస్‌కు ఆమోదం తెలపలేదని ఏపీ పోలీస్ శాఖ న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇరువాదనలు విన్న ఏపీ హైకోర్టు ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ ను తిరస్కరించింది.

అయితే అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు మద్దతిస్తూ నామినేషన్ దాఖలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో గోరంట్ల మాధవ్ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే సోమవారం గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవితలు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థులుగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.