ఎన్నికల వేళ సీనియర్ రాజకీయ వేత్త, టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు గట్టి షాక్ తగిలింది. తీసుకున్న రుణాలను తీర్చని నేపథ్యంలో రాయపాటి ఇంటిని ఆంధ్రా బ్యాంక్ వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే.. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్లు రుణాలు తీసుకుంది. ఇందులో ఆంధ్రా బ్యాంకుకు రూ.748.77 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఈ రుణానికి గ్యారంటర్లుగా ఉన్న రాయపాటి కుమారుడు రంగారావు, కుమార్తెలు దేవికారాణి, లక్ష్మీలతో పాటు మరో 14 మందికి ఆంధ్రా బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్ నెం-7లో ఉన్న జీ+3 వాణిజ్య భవనాన్ని వచ్చే నెల 25న వేలం వేస్తున్నట్లు బ్యాంక్ పేపర్లో ప్రకటన ఇచ్చింది.

631 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బిల్డింగ్ కనీస ధరను రూ.7,36,14,000గా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనేవారు రూ.73,61,400 డిపాజిట్ కింద జమ చేయాలని పేర్కొంది.