అనంతపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కొందరు సిట్టింగ్ లను మార్చకుంటే ఈసారి ఎన్నికల్లో తాను ఓటమిపాలవ్వడం ఖాయమని టిడిపి ఎంపీ జేసిదివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్ల వారిని మార్చకుంటే ఈసారి ఎంపీగా పోటీ చేయొద్దని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఎలాగూ ఓడిపోతామని తెలిసి కూడా పోటి చేయలేనని అన్నారు. అయితే తాను సూచించిన స్థానాల్లో ముఖ్యమంత్రి సిట్టింగ్ లను మారుస్తాడన్న నమ్మకం తనకుందని జేసి ఆశాభావం వ్యక్తం చేశారు. 

జేసి ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం లోక్ సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మంట్స్ వున్నాయి. వీటిలో ఆరింట టిడిపి ఎమ్మెల్యేలుండగా...ఒక చోట వైఎస్సా‌ర్‌సిపి ఎమ్మెల్యే  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఆరుగురిలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసి  డిమాండ్ చేస్తున్నారు. 

ఇలా జేసి మార్చాలంటున్న నియోజకవర్గాల్లో శింగనమల, కళ్యాణ దుర్గం, గుంతకల్లు లు వున్నాయి. కల్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, గుంతకల్లులో జితేందర్ గౌడ్, శింగనమలలో యామిని బాల లు ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వీరిని మళ్లీ టికెట్ రాకుండా జేసి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ  స్థానాల్లో తనకు అనుకూలంగా నాయకులను టిడిపి  నుండి బరిలోకి దించాలని జేసి భావిస్తున్నారు. 

ఇదే విషయాన్ని జేసి ఇటీవల టిడిపి స్క్రీనింగ్ కమిటీ ముందుంచారు. అయితే ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని చెప్పారని ఆయన వారిని కలిసిన తర్వాత మీడియాకు వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తాను గౌరవిస్తానని... అయితే ఈ ముగ్గురిని మార్చకుంటే మాత్రం పార్టీలోనే వుంటాను కానీ పోటీ చేయనని జేసి తెలిపారు.