Asianet News TeluguAsianet News Telugu

బీసీలదే హవా: నిమ్మలకు హ్యాట్రిక్ దక్కేనా, గోరంట్ల బోణి కొట్టేనా

హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్‌లో  టీడీపీ ఆవిర్భావం తర్వాత బీసీ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. ఈ పార్లమెంట్ స్థానంలో  పది దఫాలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఓటర్ల ఆశీర్వాదాన్ని కోరుతున్నారు

7 times Bc candidates won after 1984 in hindupur parliament segment
Author
Hindupur, First Published Apr 8, 2019, 3:31 PM IST


హిందూపురం:  హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్‌లో  టీడీపీ ఆవిర్భావం తర్వాత బీసీ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. ఈ పార్లమెంట్ స్థానంలో  పది దఫాలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఓటర్ల ఆశీర్వాదాన్ని కోరుతున్నారు.

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఎక్కువగా బీసీలే ఉన్నారు.1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన కె.వి. రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి  మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు.  1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సంజీవరెడ్డి, 1971లో కాంగ్రెస్ అభ్యర్ధి పి. బాయపరెడ్డి, 1977లో కూడ బాయపరెడ్డి నెగ్గారు.1980లో జరిగిన ఎన్నికల్లో పి. బాయపరెడ్డి గెలిచారు.

1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కె. రామచంద్ర రెడ్డి తొలిసారిగా ఈ స్థానం నుండి  విజయం సాధించారు.1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సానిపల్లి గంగాధర్ నెగ్గారు.1996లో ఎస్. రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 1998లో కాంగ్రెస్ అభ్యర్ధిఎస్. గంగాధర్ నెగ్గారు. 1999 ఎన్నికల్లో బికె పార్థసారథి ఈ స్థానం నుండి విజయం సాధించారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నిజాముద్దీన్ విజయం సాధించారు.2009 ఎన్నికల్లో నిమ్మల కిష్టప్ప తొలిసారి ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి నిమ్మల కిష్టప్ప పోటీ చేసి నెగ్గారు. మూడోసారి నిమ్మల కిష్టప్ప టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి ఈ దఫా వైసీపీ మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్‌ను బరిలోకి దింపింది. వీరిద్దరూ కూడ బీసీ సామాజిక వర్గానికి చెందినవారే.

హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆరు చోట్ల టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కదిరిలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన చాంద్ బాషా ఆ తర్వాత టీడీపీలో చేరారు.ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, రాఫ్తాడు, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో టీడీపికి మంచి పట్టుంది.

1984 నుండి హిందూపురం పార్లమెంట్ స్థానానికి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఏడు దఫాలు విజయం సాధించారు.బీసీ సామాజిక వర్గంలో  కూడ మూడు దఫాలు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గంగాధర్, కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎస్. రామచంద్రారెడ్డి, బీకే పార్థసారథి విజయం సాధించారు. 2009 నుండి చేనేత సామాజిక వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప నెగ్గారు.

వైసీపీ ఈ దఫా కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో 15,76,770 మంది ఓటర్లున్నారు. వీరిలో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారు 1.80 లక్షల మంది ఉంటారు.ముస్లింలు 1.70 లక్షలు, చేనేతలు 85 వేల మంది, ఎస్సీలు 1.80 లక్షలు, కురుబలు 1.30 లక్షల ఓటర్లు ఉన్నారు. వడ్డెర, రెడ్డి సామాజిక వర్గాలు కూడా కీలకంగానే ఉన్నాయి.

ఇప్పటివరకు టీడీపీకి ఆయువుపట్టుగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వైసీపీ తమ అభ్యర్ధినిత బరిలోకి దింపింది. అయితే  ఏ మేరకు టీడీపీ ఓటు బ్యాంకును వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ తన వైపుకు తిప్పుకొంటారోననే చర్చ సర్వత్రా సాగుతోంది. 

మరో వైపు హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైసీపీ అభ్యర్ధిగా మైనార్టీకి చెందిన ఇక్బాల్‌ను ఆ పార్టీ బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో కూడ మైనార్టీల ఓట్లు కీలకంగా ఉంటాయి.హిందూపురం పార్లమెంట్ స్థానంలో  ఓటర్లు ఎవరివైపున నిలుస్తారోననే విషయం మే 23న తేలనుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios