హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు టికెట్ ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశారు. 

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు సునీల్ కుమార్. అయితే సునీల్ కుమార్ కు రాబోయే ఎన్నికల్లో సీట్ ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతుండటంతో ఆయన మూడు రోజుల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసేందుకు భార్యతో కలిసి లోటస్ పాండ్ వెళ్లారు. 

అయితే సెక్యూరిటీ సిబ్బంది సునీల్ కుమార్ ను లోపలకు పంపకుండా అడ్డుకుంది. దాదాపు రెండు గంటలపాటు వేచి చూసి వెళ్లిపోయారు. అయితే ఆయన వైఎస్ జగన్ ను కలిసేందుకు ఆయన నివాసం వద్ద వేచి చూస్తున్న సమయంలో వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటుగా వెళ్తున్నా తనను చూసి కూడా పట్టించుకోలేదని ఆయన మనస్థాపం చెందారు. 

ఆ రోజు సాయంత్రం ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతోందో అర్థం కావడం లేదని సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశారు. తనకు సీటు ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావడం లేదని తెలిపారు. 

తనకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తనను ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ అపాయింట్మెంట్ దొరకని తర్వాత తీవ్ర మనస్థాపం చెందిన సునీల్ కుమార్ మరో సెల్ఫీ వీడియో తీశారు. 

తనకు వైఎస్ జగన్ అంటే  ఎంతో అభిమానమని, తనకు తొలిసారిగా టికెట్ ఇచ్చి తనను ఎంతో గౌరవించారని చెప్పుకొచ్చారు. తాను వైఎస్ జగన్ ను ఎంతగానో ఆరాధిస్తానని ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు. 

అయితే ఇటీవల కాలంగా తాను టీడీపీకి అమ్ముడుపోయానంటూ వస్తున్న వార్తలు తనను మానసికంగా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ తాను టీడీపీకి అమ్ముడుపోయానని వస్తున్న ప్రచారం మాత్రం తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. 

తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తాను బతకాలంటే గౌరవంగా బతుకుతానని స్వతహాగా వైద్యుడును కావడంతో సంపాదనకు లోటు లేదన్నారు. తాను ఏనాడు తప్పు చెయ్యలేదని ఆ విషయాన్ని గమనించాలని కోరారు. 

తనను టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభాలు గురి చేసినా తాను వైసీపీని వీడలేదని ఆ విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు తెలుసునన్నారు. వైద్యుడిగా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే తాను టీడీపీకి అమ్ముడుపోయానంటూ వస్తున్న వార్తలతో తీవ్రమనస్థాపం చెందానని తెలిపారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మేధావి అని రాష్ట్రానికి ఏదో చెయ్యాలని పరితపిస్తూ ఉంటారన్నారు. ఆయన అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తారని తెలిపారు. దళితులంటే వైఎస్ జగన్ కు ప్రత్యేక అభిమానం అని రాబోయే ఎన్నికల్లో దళితులంతా వైఎస్ జగన్ కు అండగా ఉండి జగన్ ముఖ్యమంత్రిగా చేసేందుకు సహకరించాలని కోరారు. 

తాను ఏ లోకంలో ఉన్నా వైఎస్ జ గన్ ముఖ్యమంత్రి కావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. మనిషి చనిపోయే ముందు నిజమే చెప్తారని అందుకే తాను నిజం చెప్తూ ఈ సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జగన్ నివాసంలో నో ఎంట్రీ