హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు చాలా గమ్మత్తుగా మారిపోతున్నాయి. ఏ నేత పార్టీ అధినేతపైనా, పార్టీపైనా అలుగుతారో అన్నది అర్థంకాని ప్రశ్న. అంతేకాదు ఏ కార్యకర్తను కూడా విమర్శించే సాహసం చెయ్యలేని పరిస్థితి. 

చీవాట్లు పెట్టినా తిట్టినా మరుసటి రోజు ఆ కార్యకర్త పార్టీలో ఉంటారో లేరో అన్న సందేహంతో ఎవరిని నొప్పించకుండా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు పార్టీ అధినేతలు. అయితే చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం. సునీల్ కుమార్ వైఎస్ జగన్ ను కలిసేందుకు లోటస్ పాండ్ కు చేరుకున్నారు. 

వైఎస్ జగన్ ను కలిసేందుకు కుటుంబం సభ్యులతో సహా ఎమ్మెల్యే సునీల్ కుమార్ రెండు గంటలపాటు వేచి చూశారు. చిత్తూరు జిల్లాకు అన్నీ తానై వ్యవహరిస్తున్న పుంగనూరు ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అదే సమయంలో జగన్ నివాసానికి వెళ్తూ సునీల్ ను చూశారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఎమ్మెల్యే సునీల్ ను చూసినా కనీసం స్పందించలేదు. దీంతో సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు తీవ్రమనస్థాపానికి లోనయ్యారు. రెండుగంటలపాటు వేచి చూసినా అధినేత కరుణించకపోవడంతో సునీల్ మనస్థాపానికి గురయ్యారు. అయితే సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతుంది.

సునీల్ కుమార్ పనితీరుపై అధినేత అసంతృప్తితో ఉన్నారని అతనికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సునీల్ కుమార్ కుటుంబ సమేతంగా తన టికెట్ పై వైఎస్ జగన్ తో చర్చించేదుకు వచ్చినట్లు సమాచారం.