హైదరాబాద్: అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీల అధినేతలకు పెద్ద తలనొప్పిగానే మారింది. గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు పార్టీ అధినేతలు వ్యూహాలు రచిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాల నుంచి ఎదురవుతున్న అసమ్మతి అధినేతలకు తలబొప్పికడుతోంది. 

ఎన్నడూ లేని విధంగా పార్టీ అధినేతల ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు. పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఒకప్పుడు పార్టీ కార్యాలయాల దగ్గర ఉండే ఈ నిరసనలు నేడు అధినేతల నివాసాల వద్దకు పాకింది. 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద తెలుగుతమ్ముళ్లు  నిరసనలకు దిగితే తాజగా వైఎస్ జగన్ నివాసం వద్ద ఆందోళనలు ప్రారంభమయ్యాయి.  ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నివాసం అభ్యర్థులతో కళకళలాడాల్సింది పోయి అసమ్మతి నిరసనలతో సెగలు కక్కుతోంది. 

అంతే స్థాయిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కూడా వైసీపీ అసమ్మతి సెగలు కక్కుతోంది. మంగళగిరి టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెందిన పలువురు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే తాజాగా లోటస్ పాండ్ వద్ద మంగళవారం అసమ్మతి సెగ రాజుకుంటోంది. 

ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ వైసీపీ నేత శివరామిరెడ్డి అనుచరులు ఆందోళనలకు దిగారు. విశ్వేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహించేది లేదంటూ నిరసనలు చేపట్టారు. 

జగన్ ను కలిసేందుకు వచ్చిన ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి వాహనాన్ని ఆందోళన కారులు అడ్డుకున్నారు. విశ్వేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతామని వివేకానందరెడ్డికి స్పష్టం చేశారు. శివరామిరెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జగన్ నివాసంలో నో ఎంట్రీ