విజయవాడ: వంగవీటి రాధాకృష్ణకు చెక్ పెట్టే యోచనలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వంగవీటి రాధాకృష్ణ దాదాపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇటీవలే మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధా రాబోయే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. 

వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ వంగవీటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యువనాయకుడు వంగవీటి నరేంద్రకు గాలం వేసే పనిలో పడింది. వంగవీటీ ఫ్యామిలీలో యువనేతగా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నరేంద్రను పార్టీలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మమ్మద్ ముస్తఫా వంగవీటి నరేంద్రతో చర్చలు జరిపారని తెలుస్తోంది. వంగవీటి నరేంద్ర దివంగత వంగవీటి రంగా సోదరుడు నారాయణరావు కుమారుడు. అయితే నరేంద్రను పార్టీలోకి చేర్చుకుంటే రాధాకు చెక్ పెట్టొచ్చని వైసీపీ భావిస్తోంది. 

నరేంద్ర తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గతంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నరేంద్ర వైసీపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే తాను వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని వంగవీటి రాధా ఇప్పటికే స్పష్టం చేశారు. 

సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన వంగవీటి రాధా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలో అనే అంశం చంద్రబాబు నాయుడుకే వదిలేసిన వంగవీటి రాధా తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారట. వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారట. వంగవీటి రాధా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

సైకిలెక్కనున్న వంగవీటి రాధా: చక్రం తిప్పిన లగడపాటి