విజయవాడ: ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధా సైకిలెక్కేందుకు నిర్ణయించుకున్నారా...?మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వరుస భేటీల వెనుక మర్మం ఇదేనా...?వంగవీటి రాధా టీడీపీలో చేరేందుకు లగడపాటి రాజగోపాల్ మధ్యవర్తిత్వం జరిపారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత...?

సోమవారం రాత్రి వంగవీటి రాధాతో కలిసి లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు ను కలిసింది పార్టీలో చేరే అంశంపై చర్చించేందుకేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒకవైపు తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్తూనే మరోవైపు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా ఎన్నికలకు 36 గంటల ముందు మహాకూటమి అధికారంలోకి వస్తుందంటూ తన సర్వేను ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ వ్యవహారం వెనుక టీడీపీ ప్లాన్ ఉందంటూ అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. ఇప్పటికీ రాజకీయాల్లో అదే అంశం జోరుగా చర్చ జరుగుతోంది. 

లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లో లేకపోయినా టీడీపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని ప్రచారం. ఇకపోతే వైఎస్ఆ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి స్తబ్ధుగా ఉన్న వంగవీటి రాధాను తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు లగడపాటి రాయబారం నడిపారని టాక్. 

రెండు రోజుల క్రితం వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయిన లగడపాటి రాజగోపాల్ ఆ తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతోనే సమావేశమయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అయితే రాధా టీడీపీలో చేరే అంశంపై చర్చించి ఆయన డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం. 

అయితే సోమవారం రాత్రి లగడపాటి రాజగోపాల్ వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడును కలిశారని ప్రచారం. సుమారు గంటన్నరపాటు ప్రస్తుత రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది. చర్చల అనంతరం వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. 

ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని చంద్రబాబు నాయుడకే వదిలేసినట్లు చెప్పుకొచ్చారట. పోటీ చెయ్యమంటే చేస్తానని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తరపున ప్రచారం చేస్తానని చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.