హైదరాబాద్: తాను ఫ్యాన్ గుర్తుకు నొక్కితే వీవీప్యాట్‌లో తన ఓటు స్పష్టంగా కనిపించిందని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తెలిపారు. అదే నా ఓటు సైకిల్‌కు పడుంటే ఊరుకునే వాడిని కాదని ఆయన వ్యాఖ్యానించారు.ఓటమి భయంతోనే చంద్రబాబునాయుడు నానా యాగీ చేస్తున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు.

మంగళవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహాన్‌కు పోలింగ్ రోజున, ఆ తర్వాత చోటు చేసుకొన్నపరిణామాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో సుమారు 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారని ఆయన గుర్తు చేశారు. తాము ఎవరికీ ఓటు వేశామో..... అదే గుర్తుకు ఓటు పడినట్టుగా వీవీప్యాట్‌పై చూసీ సంతృప్తి చెందాకే ఓటర్లు పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చారని  జగన్ గుర్తు చేశారు. ఒకవేళ తాము ఓటు వేసిన అభ్యర్ధి, లేదా గుర్తుకు ఓటు పడకపోతే ఓటర్లు గొడవ చేసేవారు కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఓట్లు వేసిన వారంతాసంతృప్తి చెందారన్నారు. తాను ఎవడికి ఓటు వేశానో తనకే తెలియదని  చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు పోలింగ్‌కు ముందు 50 ఓట్లు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని ఆయన గుర్తు చేశారు. ఈవీఎంలో మాక్ పోలింగ్ సందర్భంగా ఏమైనా తేడాలు వస్తే పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీల ఏజంట్లు ఎందుకు ఊరుకొంటారని ఆయన ప్రశ్నించారు.

2014 ఎన్నికల్లో ఈవీఎంలలో వీవీప్యాట్లు లేవన్నారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు విజయం సాధించారన్నారు.కానీ ఆ ఎన్నికల్లో తాము ఈవీఎంలు బాగా లేవని తాము ఆరోపణలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడ ఈవీఎంలు, వీవీప్యాట్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ప్రజలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని తెలుసుకొన్న తర్వాత చంద్రబాబునాయుడు ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఓడిపోతే ప్రజలు ఓటేయలేదని చెప్పకుండా ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.ఐదేళ్ల బాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయి చంద్రబాబుకు బైబై బాబు అంటూ వీడ్కోలు చెప్పారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

పోలింగ్ దాడులపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు