హైదరాబాద్: ఏపీలో పోలింగ్ రోజున ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గవర్నర్ నరసింహాన్‌ను కోరారు.

మంగళశారం నాడు రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌తో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.తమ పార్టీకి చెందిన ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడ కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఆయన ఆరోపించారు.  రాష్ట్రంలో  ఏ రకంగా దాడులు జరిగాయనే విషయాన్ని గవర్నర్‌కు వివరించినట్టు ఆయన తెలిపారు.

పోలీస్ వ్యవస్థను ఏ రకంగా  చంద్రబాబునాయుడు దుర్వినియోగం చేశాడనే విషయాన్ని తాను గవర్నర్‌కు వివరించామన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్‌లోకి వెళ్లి  తలుపులు వేసుకొన్నాడని చెప్పారు. 

 పోలింగ్ బూత్‌‌లోకి వెళ్లి కోడెల శివప్రసాదరావు చొక్కాలను చింపుకొన్నాడని జగన్ ఆరోపించారు.  అయితే  ఈ విషయమై కోడెలపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 

గురజాల ప్రాంతంలో దళితులు, మైనార్టీలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యే శ్రీవాణిపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. అయినా కూడ టీడీపీ నేతలపై ఎందుకు  కేసులు పెట్టలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పూతలపట్టులో తమ పార్టీ అభ్యర్ధి ఎంఎస్ బాబుపై టీడీపీ నేతలు దాడి చేస్తే కుట్లు పడ్డాయని ఆయన గుర్తు చేశారు.  ఇంకా అతను ఆసుపత్రిలోనే  చికిత్స పొందుతున్నాడని  ఆయన ప్రస్తావించారు.

ఒకే కులానికి చెందిన 45 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారన్నారు. అంతేకాదు  తమకు అనుకూలంగా ఉన్నవారికి ఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు.

బాధితులపైనే పోలీసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మచిలీపట్నంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌ నుండి బయటకు వచ్చాయన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చారన్నారు. తమ పార్టీకి చెందిన అభ్యర్ధులకు ఎందుకు  ఈ సమాచారం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

స్ట్రాంగ్ రూమ్స్‌ను  కేంద్ర పోలీస్ బలగాల ఆధీనంలోకి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ నుండి  సీసీ కెమెరాలను  ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి కనెక్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబునాయుడు తాను చేసిన అవినీతి  కార్యక్రమాలకు సంబంధించిన  ఆధారాలు  దక్కకుండా ఉండేలా చేసే అవకాశం ఉందని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు జాగ్రత్తగా ఉండేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈవీఎంలలో మీట నొక్కిన తర్వాత వేరే పార్టీకి ఓటు వెళ్లినట్టుగా ఉంటే ఓటర్లు ప్రశ్నించే వాళ్లని జగన్ అభిప్రాయపడ్డారు.