అమరావతి:  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో రెండో సారి కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన  జనసేన  ఈ దఫా ఏ పార్టీకి ప్రయోజనం కల్గిస్తోందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2008 ఆగష్టు 26వ తేదీన తిరుపతిలో సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.  ఆ పార్టీ కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 16.22 శాతం ఓట్లు లభించాయి. పీఆర్‌పీకి ఆ ఎన్నికల్లో  6,820,845 ఓట్లు దక్కాయి. 

కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 156 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2004 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 29 ఎమ్మెల్యే సీట్లను కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో 15,374,075 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 36.56 శాతం ఓట్లు దక్కాయి.

టీడీపీ 225 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 92 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2004 ఎన్నికల కంటే ఆ పార్టీకి 45 సీట్లు అధికంగా వచ్చాయి.  టీడీపీకి ఈ ఎన్నికల్లో 11,826,483 ఓట్లు దక్కాయి. టీడీపీకి 28.12 శాతం ఓట్లు వచ్చాయి.

టీఆర్ఎస్‌కు 45 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే కేవలం 10 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. 2004 ఎన్నికలతో పోలిస్తే  ఆ పార్టీ 16 సీట్లను కోల్పోయింది.  టీఆర్ఎస్‌కు ఆ ఎన్నికల్లో 1,678,906 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 3.99 శాతం ఓట్లు వచ్చాయి. 2004 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ 2.69 శాతం ఓట్లను కోల్పోయింది.

2009 ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ  కీలకంగా వ్యవహరించింది. టీడీపీ అభ్యర్ధుల గెలుపు ఓటములను పీఆర్పీ ప్రభావితం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ రెండో దఫా అధికారంలోకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

2014 మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు.ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం నిర్వహించాడు.  ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి, బీజేపీకి దూరమయ్యారు.

ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ పార్టీ ఓట్లు చీల్చుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ కూటమి చీల్చే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక కూటమి ఓట్లే ఎక్కువగా ఉంటాయి.  అదే జరిగితే వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటును  కాకుండా టీడీపీ ఓటునే జనసేన చీల్చితే టీడీపీకి దెబ్బపడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో జనసేన కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కనీసం 7 నుండి 10 శాతం ఓట్లను ఆ పార్టీ సంపాదించుకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే  ఒకటి నుండి మూడు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టుగా సర్వే నివేదికలు చెబుతున్నాయి.రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ప్రభావం కొంత కన్పించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

 

సంబంధిత వార్తలు

మనకు శుభసూచకం: కేసీఆర్ అంచనాపై పవన్ సంచలన వ్యాఖ్యలు

ప్రచారంలో పవన్, నాగబాబులతో అల్లు అర్జున్