హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో ఆ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. 

మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు,లోకేష్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకుని మంగళగిరి ప్రజలను ఓట్లు అడుగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మున్సిపల్‌ వార్డు కూడా గెలుచుకోలేపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు,లోకేష్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయినట్లే మంగళగిరిలో లోకేష్ ఓడిపోవటం ఖాయమన్నారు. 

ఐదేళ్ల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న చంద్రబాబు మంగళగిరి, తాడేపల్లికి తాగేందుకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న సదావర్తి భూముల్ని కాజేయడానికి లోకేష్ ప్రయత్నించారని ఆరోపించారు. 

ఈ సారి మంగళగిరి వచ్చి  పానకాల స్వామి గుడినే మింగేస్తావా అని ప్రశ్నించారు. దత్తత తీసుకున్న నిమ్మకూరుని అభివృద్ధి చేయలేని లోకేష్ మంగళగిరిని ఉద్దరిస్థాడా అంటూ ఆర్కే ధ్వజమెత్తారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మంగళగిరి సీటు చరిత్ర ఇదీ: అందుకే లోకేష్ పోటీ

ఎట్టకేలకు నారా లోకేష్ సీటు ఖరారు: మంగళగిరి నుంచి పోటీ