పాణ్యం: పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి తిరిగి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ ఎన్నికల్లో నంద్యాల ఎంపీ లేదా బనగానపల్లె అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదు. బిజ్జం పార్ధసారధి రెడ్డి చంద్రబాబుతో చర్చించారు. బాబు ఆదేశాల మేరకు బిజ్జం పార్థసారధి రెడ్డి టీడీపీ కార్యక్రమాల్లో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  1999ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బిజ్జం పార్థసారథి రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి కాటసాని రాంభూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి బిజ్జం పార్థసారథి రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.  కాటసాని రాంభూపాల్ రెడ్డి 4592 ఓట్ల మెజారిటీతో  బిజ్జం పార్థసారథి రెడ్డిపై  విజయం సాధించారు.

2004 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా  ఉంటున్నారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి మధ్య రాజీ కుదరింది.   అప్పటి నుండి బిజ్జం పార్థసారథి రెడ్డి హైద్రాబాద్‌లో రాజకీయాలు చేసుకొంటున్నారు.

2014 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. కానీ, ఈ స్థానం నుండి బీసీ జనార్ధన్ రెడ్డికి చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇచ్చారు. జనార్ధన్ రెడ్డి విజయానికి పరోక్షంగా బిజ్జం పార్థసారథి రెడ్డి సహకరించారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో బిజ్జం పార్థసారథి రెడ్డి ఇటీవలనే చర్చించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని బిజ్జం పార్థసారథిరెడ్డిని బాబు  కోరారు.  బిజ్జం కూడ ఈ మేరకు సానుకూలంగా స్పందించారు. బనగానపల్లె, పాణ్యం, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజ్జం పార్థసారథి రెడ్డి ప్రచాం చేయనున్నారు. 

బిజ్జం పార్థసారథి రెడ్డి తిరిగి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవడంతో  బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు పట్టణాల్లో టపాసులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్‌బంక్‌, పొట్టిశ్రీరాముల సెంటర్‌, బీసీ గుర్రెడ్డి కాంప్లెక్స్‌ వద్ద టపాసులు పేల్చి బిజ్జం రాకను స్వాగతించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి పున:ప్రవేశం కోసం బిజ్జం స్కెచ్: నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ