సాలూరు: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీని అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు సరెండర్ కావాలా,  కేసీఆర్‌కు బానిస కావాలా అని ఆయన ప్రశ్నించారు.

గురువారం నాడు విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తనకు రిటర్న్ గిఫ్ట్  ఇస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నాడన్నారు. జగన్‌కు ఇచ్చే వెయ్యి కోట్లే తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ చంద్రబాబునాయుడు చెప్పారు.

ఇప్పటికే కేసీఆర్ పంపిన వెయ్యి కోట్లు రాష్ట్రానికి చేరాయన్నారు. ఒక్కో ఓటును రూ.5వేలకు కూడ వైసీపీ కొనుగోలు చేసేందుకు సిద్దమైందని  ఆయన ఆరోపించారు.తెలంగాణలో ఆస్తులున్న నేతలను కేసీఆర్ భయపెడుతున్నారని ఆయన చెప్పారు. టీడీపీకి ఓటేస్తే తెలంగాణలోని ఆస్తులను లాక్కొంటామని బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు.

తెలంగాణకు సరెండర్ కావాలా,  కేసీఆర్‌కు బానిస కావాలా అని ఆయన ప్రశ్నించారు.జగన్‌ను అడ్డం పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీపై పెత్తనం చేయాలని ప్లాన్ చేస్తోందన్నారు.

తెలంగాణలో అన్ని పార్టీలను కేసీఆర్ ఫినిష్ చేశాడన్నారు. 2014 ఎన్నికల్లో  టీడీపీ 15 ఎమ్మెల్యేలు గెలిస్తే అందరినీ లాక్కొన్నాడన్నారు. తమతో పాటు అన్ని పార్టీలను ఇలానే చేశాడన్నారు. ఇప్పడు రెండు ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్కరిని కేసీఆర్ తీసుకొన్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఆయన చెప్పారు.

ఏపీలో జగన్‌ను గెలిపించి ఢిల్లీలో పెత్తనం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని చంద్రబాబునాయుడు ఆరొపించారు.ఏపీకి ఇవ్వాల్సిన లక్ష కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ టీఆర్ఎస్ కేసు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్ కోరుతున్నాడని... ఒక్కసారి అవకాశమిస్తే రాష్ట్రాన్ని దోచుకొంటారని చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. జగన్‌కు పరిపాలన అనుభవం ఉందా, రాజకీయ అనుభవం ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

డ్రైవర్‌ చక్కగా ఉంటేనే  బస్సు గమ్యానికి చేరుతోందన్నారు.జగన్‌ ఎప్పుడు జైలుకు వెళ్తాడో కూడ తెలియదని ఆయన ఎద్దేవా చేశారు.జగన్ సీఎం అయితే రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేస్తాడని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై కేసులు: మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చంద్రబాబు సవాల్