కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలిజాబితాలో శ్రీశైలం అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ప్రకటించారు. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బుడ్డా రాజేశేఖర్ రెడ్డి కలిశారు. 

తాను పోటీ చెయ్యలేనని తన సోదరుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. తన భార్య శైలజ అనారోగ్య పరిస్థితుల వల్ల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందుకు పార్టీ, కార్యకర్తలు, ప్రజలు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి తాను శ్రీశైలం నుంచి పోటీచేయలేనని చెప్పినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో శ్రీశైలం టిక్కెట్‌ తన సోదరుడికి ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో ఎవరికి ఇచ్చినా తాము గెలిపించుకునేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. 

ఇకపోతే శ్రీశైలం నియోజకవర్గం టికెట్ ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మహానంది, బండిఆత్మకూరు మండలాల్లో ఏవీ సుబ్బారెడ్డికి మంచి పట్టుంది. అయితే పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబుకు స్పష్టం చేశారు ఏవీ సుబ్బారెడ్డి. 

మరోవైపు బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి వైఖరిపై  కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వేల్పనూరులోని ఆయన నివాసం వద్ద నినాదాలు చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని వారంతా కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు ఫిరాయింపు ఎమ్మెల్యే షాక్: టికెట్ ఇచ్చినా పోటీ చెయ్యనంటున్న బుడ్డా