కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో అభ్యర్థి షాక్ ఇవ్వనున్నట్లు తెలస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు వెనుకాడుతున్నారట ఆ అభ్యర్థి. 

ఇప్పటికే నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి షాక్ ఇవ్వడంతో ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. కర్నూలు జిల్లా శ్రీశైలం టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత  ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 

అయితే పోటీ చేసేందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసే అంశంపై చర్చించేందుకు సోమవారం సాయంత్రం కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 

అయితే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణమాలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నట్లు సమాచారం.