రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హీరో బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంపై గురి పెట్టారు.

బీసీలతో పాటు మైనార్టీలకు గట్టి పట్టున్న ఈ ప్రాంతంలో టీడీపీని ఎదుర్కోనేందుకు రిటైర్ట్ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్‌ను రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు హిందూపురంలో టాక్ వినిపిస్తోంది.

గతంలో మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని బాలయ్యపై ప్రయోగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఘనీ ఆరోగ్యం సరిగా లేకపోవడం. చురుగ్గా ఉండకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి.

ఎన్నికలకు ముందు క్యాడర్‌లో స్తబ్ధత నెలకొన్న పరిస్ధితుల్లొ మరో నేత అవసరాన్ని జగన్ గుర్తించారు. దీనిలో భాగంగానే ఇక్బాల్ అహ్మద్ పేరు తెర మీదకు వచ్చింది. మరోవైపు హిందూపురంతో పాటు చిలమత్తూరు మండలాల్లో సైతం బలమైన మైనార్టీ కోసం వైసీపీ అన్వేషిస్తోంది.

మైనార్టీ అయినప్పటికీ స్థానికంగా ఆర్ధిక, అంగబలం వున్న వారిని రంగంలోకి దింపేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇక్బాల్ అహ్మద్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది.

ఇతను స్వతహాగా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి.. అయినప్పటికీ హిందూపురానికి బంధుత్వంతో పాటు గతంలో పోలీస్ అధికారిగా పరిచయాలు ఉన్నాయి. దీనిలో భాగంగానే శుక్రవారం రాత్రి ఇక్బాల్ హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి హిందూపురం అభ్యర్ధిత్వంపై చర్చించినట్లుగా సమాచారం.