హైదరాబాద్ లోని ఆంధ్రా ఓటర్లకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. గురువారం జరిగే పోలింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారు తీవ్ర రద్దీ కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పిల్లలకు హాలిడేస్ వుండటంతో అందరూ కుటుంబాలతో కలిసి వెళుతుండటంతో ఈ రద్దీ మరీ ఎక్కువగా వుంది. దీంతో హైదరాబాద్ నుండి ఎపికి వెళ్లే ఆర్టిసి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు నిత్యం రాకపోకలు సాగించే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల సమస్యను దృష్టిలో వుంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను తెలంగాణ నుండి ఏపికి నడపడానికి సిద్దమయ్యింది. 

గురువారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నఎన్నికల దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి ఏపీకి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. బుధవారం సాయంత్రం 6.20కి సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు ఓ ప్రత్యేక రైలు ఇప్పటికే ప్రయాణికులను తీసుకుని వెళ్లినట్లు అధికారులు తెలిపారు.   అలాగే రాత్రి.7.20కి సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి,  రాత్రి 9గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడకు మరో రెండు ప్రత్యేక రైళ్లు కూడా బయలుదేరినట్లు వెల్లడించారు. 

ఈ ప్రత్యేక రైళ్లలో కేవలం జనరల్ బోగీలు మాత్రమే అందుబాటులో వుంచామని...ప్రత్యేకంగా రిజర్వేషన్ అవసరం లేకుండా స్టేషన్లలోనే  టికెట్లు తీసుకుని ప్రయాణించవచ్చని తెలిపారు. అలాగే సాధారణంగా నడిచే రైళ్లు యదావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు.