అనంతపురం: మంత్రి పరిటాల సునీత ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆమె స్థానంలో కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు. రాప్తాడు శాసనసభ నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. 

పరిటాల శ్రీరామ్ పోటీ చేసే విషయాన్ని సునీత స్వయంగా వెల్లడించారు. అభిమానుల కోరిక మేరకు పరిటాల శ్రీరామ్ ను పోటీకి దించుతున్నట్లు ఆమె తెలిపారు. తాము రెండు సీట్లు అడుగుతున్నామని, అందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంగీకరించకపోతే తాను పోటీకి దూరంగా ఉంటానని, శ్రీరామ్ పోటీ చేస్తారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆమె చెప్పారు. 

తమకు కల్యాణదుర్గం సీటును కూాడా ఇవ్వాలని సునీత చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో తాను పోటీ నుంచి విరమించుకుని పరిటాల శ్రీరామ్ ను దించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ రెడ్డిని పోటీకి దించతుండగా, తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిని పోటీకి దించుతున్నారు. ఇప్పుడు పరిటాల సునీత తన కుమారుడిని రంగంలోకి దించుతున్నారు.