తిరుపతి: మదనపల్లె శాసనసభ్యుడు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వనున్నారు. ఆయన స్థానంలో మదనపల్లె నుంచి మైనారిటీ నాయకుడిని బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. దీంతో తిప్పారెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకునేందుకు దేశాయ్‌ తిప్పారెడ్డి మంగళవారం అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మదనపల్లె రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి తిప్పారెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌నే నమ్ముకున్నారు. ఆయన మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. 

వైసీపీ తరపున ఎన్నికలు ఎదుర్కొన్న తొలి నేతగా చరిత్ర సృష్టించారు. అలాగే ఆ పార్టీ తరపున శాసనమండలిలో అడుగుపెట్టిన తొలి ప్రజాప్రతినిధి కూడా ఆయనే. తర్వాత గత ఎన్నికల్లో అదే పార్టీ తరపున పోటీ చేసి మదనపల్లె నుంచీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

అయితే, మదనపల్లెలో ముస్లిం మైనారిటీల ఓట్లు అధికంగా వున్నందున ఆ వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్‌ ఇస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అతని గెలుపునకు కృషి చేస్తే భవిష్యత్తులో మంచి పదవి, గుర్తింపు ఇస్తామని కూడా చెప్పారు. 
 
అయితే, తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడమా, జనసేనలో చేరడమా అనే సందిగ్ధంలో పడ్డారు. అదే సమయంలో జగన్ మాటను శిరసావహించి పార్టీలోనే కొనసాగడమా అని కూడా ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తమ పార్టీలో చేరాల్సిందిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో గతంలో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అయితే ఆయన ఆ విషయాన్ని దాటవేస్తూ వస్తారు. అయితే, మంగళవారం ఉదయం 10 గంటలకు మదనపల్లె పట్టణం మిషన్‌ కాంపౌండ్‌లోని జాకబ్‌ ఛాంబర్లేన్‌ మెమోరియల్‌ హాల్లో సమావేశం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
తిప్పారెడ్డి ఒకవేళ పార్టీని వీడేందుకు నిర్ణయిస్తే దాని వల్ల పార్టీ అభ్యర్థి విజయావకాశాలు ప్రభావితం కాకుండా చూడడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డి రంగంలో దిగారు.