విశాఖపట్నం: విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఇంచార్జీ, విశాఖ ఉత్తరం మాజీ శాసనసభ్యుడు తైనాల విజయ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పోలీంగ్ కు కేవలం నాలుగు రోజుల వ్యవధి ఉన్న ప్రస్తుత తరుణంలో ఆయన వైసిపిని వీడడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే ఆయన కార్పోరేటర్ గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంత వరకు కాంగ్రెసు, వైసిపిల్లో పనిచేశారు. ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. 

గంటా శ్రీనివాస రావుకు మద్దతుగానే విజయ కుమార్ వైసిపిని వీడి టీడీపిలో చేరారు. ఉత్తర నియోజకవర్గంలో బలం పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది నాయకులను వివిధ రూపాల్లో గంటా తన వైపు తిప్పుకున్నారు. ఆ వరుసలోనే తాజాగా తైనాల విజయ్ కుమార్ గంటాకు మద్దతుగా టీడీపిలో చేరారు. 

ఈ నెల 5వ తేదీన జనసేన నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు నరసింహమూర్తి, ఆయన సతీమణి జనసేన నాయకురాలు గుంటూరు భారతి, వారి అనుచరులు తైనాల విజయ కుమార్ సమక్షంలోనే విజయసాయి రెడ్డి ఎదుట వైసిపి కండువా కప్పుకున్నారు. అయితే, తాజాగా ఉగాది పర్వదినాన విజయ్ కుమార్ టీడీపిలో చేరారు.