కర్నూలు: సిట్టింగ్ శాసనసభ్యుడు భూమా బ్రహ్మానందరెడ్డి తిరిగి నంద్యాల టికెట్ కేటాయించడంపై బనగానపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని బీసీ జనార్దన్ రెడ్డి గతంలో పలుమార్లు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ఆయన భూమాకు టికెట్ కేటాయించారు. తన ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డిని ఆర్థికంగా బలోపేతం చేసిన భూమా బ్రహ్మానంద రెడ్డికి ఎలా టికెట్ ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అంటున్నారు. తనకు టికెట్ రాదని ఒకానొక సందర్భంలో భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా అనుకున్నట్లు అర్థమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే... టీడీపీ టికెట్ రాకపోతే తాను నంద్యాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా చెప్పారు.