కాకినాడ: డేటా చోరీ కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రజల డేటాను దొంగిలించారని ఆరోపించారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల డేటాను దొంగిలించిన దొంగ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఒక ప్రైవేట్ సంస్థకు ఏపీ ప్రజల డేటాను అప్పగించడానికి చంద్రబాబు నాయుడు ఎవరు అంటూ నిలదీశారు. 

ప్రజల ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో సహా మెుత్తం డేటాను ప్రైవేట్ కంపెనీకి ఎలా అందజేస్తారంటూ జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రివైనంత మాత్రాన ప్రజల డేటాను దొంగిలిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. 

డేటా దొంగిలించి అడ్డంగా దొరికిపోయి మళ్లీ తమపై నిందలు మోపుతారా అంటూ మండిపడ్డారు. కంగారు పడొద్దని తొందర్లోనే చంద్రబాబుకు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ గోడలు బీటలు వారుతాయని జగన్ హెచ్చరించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు నయవంచకుడు, ఓట్ల దొంగ: వైఎస్ జగన్ నిప్పులు

ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తీసుకొస్తా: వైఎస్ జగన్