ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారానికి చివరిరోజైన ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాను పోటీ చేస్తున్న భీమవరంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భీమవరం ప్రజలు కేవలం ఓ ఎమ్మెల్యే కోసం ఓటు వేయడం లేదని రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి ఓటేస్తున్నారని అన్నారు. కాబట్టి కాస్త ఆలోచించి, రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో వుంచుకుని ఓటెయ్యాలని ప్రజలకు సూచించారు. 

ఇక్కడ తనపై పోటీచేస్తున్న టీడీపీ అభ్య‌ర్ధి అంజిబాబు, వైసీపీ అభ్య‌ర్ధి గ్రంధి శ్రీనివాస్ లు ఇన్నాళ్లు చేయ‌లేని అభివృద్దిని తాను గెలిచిన 9 నెల‌ల్లో చేసి చూపుతాన‌ని ప‌వ‌న్‌ హామీ ఇచ్చారు. వారిని ఇన్నాళ్లూ భరించింది చాలని... ఇకపై ఈ నియోజకవర్గ సమస్యలను తన ఇంటి సమస్యగా భావించి పరిష్కరిస్తానని తెలిపారు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా తనను ఎమ్మెల్యేగా గెలిపించడమేనని పవన్ పేర్కొన్నారు.  

విభజన తర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు ఎంతో కీల‌క‌మైన‌వ‌ని అన్నారు. అందువల్ల ప్ర‌తి ఒక్క‌రు ఆలోచించి ఓటు వేయాల‌ని కోరారు. నేను మీకు అండ‌గా ఉంటానన్న న‌మ్మ‌కం ఉంటే మీరు ఇప్పుడు నాకు అండ‌గా ఉండాలని కోరారు. 

పోరాట యాత్ర స‌మ‌యంలో వివిధ సంద‌ర్భాల్లో అన్ని మ‌తాల పెద్ద‌ల్ని క‌లిసినట్లు పవన్ గుర్తుచేశారు. వారు ఎన్నో స‌మ‌స్య‌ల‌ను నా దృష్టికి తీసుకువ‌చ్చారని తెలిపారు. అందువల్ల అధికారంలోకి రాగానే అర్చ‌కులు, ముల్లాలు, పాస్ట‌ర్ల స‌మ‌స్య‌ల మీద అధ్య‌య‌నానికి రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జిల‌తో మూడు మ‌తాల‌కు మూడు ఉన్న‌త స్థాయి క‌మిష‌న్లు వేస్తామని  ప్రకటించారు. వారి సూచ‌న‌ల మేర‌కు భ‌గ‌వంతుడి సేవ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ స‌రైన వేత‌నాలు, పెన్ష‌న్లు ఇస్తామని పవన్ హామీ ఇచ్చారు.