కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించడం ఎంతో సంతోషంగా ఉందని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తొమ్మిదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ సమర శంఖారావం సభలో పాల్గొన్న వైఎస్ జగన్ వైసీపీ కార్యకర్తల వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. మార్పుకోసం ఓటు వెయ్యాలని, విలువలకు, విశ్వసనీయతకు ఓటు వెయ్యాలని ప్రతీ పౌరుడికి వైసీపీ నేతలు చెప్పాలని చెప్పుకొచ్చారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మంగళవారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందని ఈ తొమ్మిదేళ్లపాటు వైసీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు. అధికార పార్టీ పెట్టిన వేధింపులు ఎన్నో తట్టుకున్నారు. కొంతమంది పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు ఆప్తులను పోగొట్టుకున్నారు.

దొంగకేసుల్లో ఇరుక్కుని చాలా నష్టపోయారు. ఎన్నో అవమానాలు భరించారు. మీకు తగిలిన ప్రతీ గాయం తన గుండెకు తగిలిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మీ బాగోగులు చూసుకుంటానని వైసీపీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా మీ భాగోగులు చూసుకుంటానని జగన్ స్పష్టం చేశారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దొంగ కేసులను ఎత్తివేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఆలోచించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు టీడీపీ ఏమి హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు నెరవేర్చింది అన్న అంశంపై ప్రతీ ఒక్కరూ చర్చించాలని కోరారు. ఎన్నికలకు ముందు దొంగ హామీలివ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వదిలెయ్యడం ధర్మమేనా అన్నది ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.