చంద్రబాబు దళిత వ్యతిరేకిగా అభివర్ణించిన వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వ హయాంలో 4,455 మంది దళితులపై దాడి దళితులకు రక్షణగా నిలిచేపార్టీ  వైఎస్సార్‌ కాంగ్రెస్సే


దళితులపై వివక్షను చూపుతున్న పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటె, అది తెలుగుదేశం పార్టీనే అని వైసీపి ఎంపీ వై వీ సుబ్బారెడ్డి అన్నారు.ఈ మూడేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమం అటుంచి, వారిపై దాడులు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.


దళితులపై దాడులకు పాల్పడుతున్న వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తుందన్నారు. ఈ దాడుల్లో అనేక మంది తమ ఇళ్లు వాకిలి వదిలి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు.వారికి అండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోరాడతుందని ఆయన తెలిపారు.


ఈ దాడులపై తాము కేంద్ర హోం మంత్రిని, జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ని కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. దేవరపల్లి లో జరిగిన సంఘటనను వారికి వివరించి,భాదితులకు న్యాయం చేయాలని కోరామని సుబ్బారెడ్డి వివరించారు. 


ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబును కరుడుగట్టిన దళిత వ్యతిరేకిగా తేల్చారు. గత కొన్ని రోజులుగా బలహీన వర్గాలపై దాడులు మరీ ఎక్కువయ్యాయన్నారు. సెంట్రల్ క్రైంబ్యూరో రిపోర్టు ప్రకారం ఈ ప్రభుత్వ హయాంలో 4,455 మంది దళితులు దాడులకు గురయ్యారన్నారు. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేదంటే దళిత సమాజమే తగిన బుద్ది చెబుతుందని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి.