అమరావతి: మీరు అనుకొన్నట్టుగా ఏపీలో చంద్రబాబునాయుడు గెలవడం లేదు... వైసీపీ విజయం సాధించనుందని తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకె చీఫ్ స్టాలిన్‌కు చెప్పినట్టుగా సమాచారం. డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల క్రితం చెన్నైలో సమావేశమైన విషయం తెలిసిందే.

స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశమైన మరునాడు ఆ పార్టీకి చెందిన కీలక నేత దొరై మురుగన్  మంగళవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతిలో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

కేసీఆర్‌, స్టాలిన్ సమావేశంలో చోటు చేసుకొన్న అంశాలను దొరై మురుగన్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో సుమారు 18 నుండి 21 ఎంపీ సీట్లు జగన్‌కు వస్తాయని కేసీఆర్ వివరించినట్టుగా సమాచారం. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కూడ ఆయన ఈ సమావేశంలో వివరించినట్టుగా తెలిసింది.  ఈ విషయాలను దొరై మురుగన్ బాబుకు చెప్పారని తెలుస్తోంది.

అయితే ఏపీలో జగన్ విజయం సాధిస్తారని కేసీఆర్ చెప్పగానే అది మీ అభిప్రాయం కావచ్చు అని స్టాలిన్ వ్యాఖ్యానించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో తమిళనాడులో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులను కూడ చంద్రబాబునాయుడు అడిగి తెలుసుకొన్నారని సమాచారం.

ఈ నెల 23వ తేదీ ఎన్నికల ఫలితాల తర్వాత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబునాయుడు దొరై మురుగన్‌కు సూచించారు. పార్టీల్లో చీలికలు తెచ్చేందుకు కూడ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడ లేకపోలేదని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాదని తెలిస్తే మెజారిటీ పార్టీలు మనవైపుకే వచ్చే అవకాశం ఉందని కూడ ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

నిన్న స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ: నేడు చంద్రబాబుతో స్టాలిన్ దూత

కేసీఆర్‌ ఫ్రంట్‌కు షాక్: స్టాలిన్‌ వ్యాఖ్యలివే