హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్వయంగా చేయించుకున్న సర్వేలో వైసీపీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నారు. 

అంతేకాదు వివిధ సర్వేలు సైతం వైసీపీకి అనుకూలంగానే ఫలితాలను ప్రకటిస్తున్నాయి. సర్వేల మహిమో లేక వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమాయో తెలీదు కానీ కొంతమంది ఎమ్మెల్యే మంత్రులుగా ప్రకటించేసుకుంటున్నారు. 

అంతేకాదు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల అనుచరులు తమ నేతకే మంత్రి పదవి అంటూ తెగ సంబరపడిపోతున్నారు. సంబరపడిపోతే పర్వాలేదు ఏకంగా ఫ్లెక్సీలు, స్టిక్కర్లపై కాబోయే మంత్రి అంటూ మరీ రాసేసి లేని పోని చిక్కులు తెస్తున్నారు. 

ఆలు లేదు చూలు లేదు అప్పుడే మంత్రి పదవుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎలాగూ అధికారంలోకి వస్తున్నాం అప్పుడే పదవుల రాద్ధాంతం ఎందుకు అంటూ క్లాస్ పీకారట. 

అభిమానులు, కార్యకర్తలు సైతం కాబోయే మంత్రి, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఎక్కడా ఎలాంటి ఫ్లెక్సీలు గానీ స్టిక్కర్ల ద్వారా గానీ ప్రచారం చేయోద్దని కాస్త సంయమనం పాటించాలని క్లాస్ పీకారట. దీంతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను అలర్ట్ అయ్యారు. 

అధినేత అక్షింతలు వేసింది తనకేనని భావించిన ఆయన ఎన్నికల ఫలితాలు రాకముందే కాబోయే మంత్రి అని ప్రకటించడం సరికాదని కార్యకర్తలకు సూచించారట. మునిసిపల్‌ చైర్మన్‌ ఇంటూరి రాజగోపాల్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్న మంచినీటి బాటిల్స్‌పై కాబోయే మంత్రిగా తనను పేర్కొనడం మంచి పద్ధతి కాదంటూ సామినేని ఉదయభాను ఖండించారట. 

ఈ వార్తలు కూడా చదవండి

ఊహాల్లో తేలుతున్న వైసీపీ నేతలు: కాబోయే మంత్రి అంటూ హల్ చల్

నన్ను గుర్తుంచుకోండి సార్: జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రిక్వస్ట్