చాలా రోజుల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి . చంద్రబాబు మేనిఫెస్టోను జనం నమ్మరని, వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇచ్చే హామీలను కాపీ కొట్టి పార్ట్ 2 మేనిఫెస్టో వదులుతారేమోనంటూ ఆయన సెటైర్లు వేశారు.  

వైసీపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అనుబంధ విభాగాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ట్రాప్‌లో అమిత్ షా పడ్డారా అంటూ ఆయన సెటైర్లు వేశారు. విశాఖకు ఖచ్చితంగా పరిపాలనా రాజధానిని తరలిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజధానికి కావాల్సిన భవనాలను రెండేళ్ల క్రితమే గుర్తించామని ఆయన తెలిపారు. కేంద్రం హామీలను నెరవేర్చడం లేదని సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మినీ ఫెస్టోను జనం నమ్మరని ఆయన స్పష్టం చేశారు. నవంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ పార్టీలు ఇచ్చే హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్ 2 మేనిఫెస్టోను ప్రకటిస్తారేమోనంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

పార్టీ విజయం కోసం పనిచేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్యే ఆదేశాలనే పాటించాలని .. రెండో గ్రూప్‌ను ప్రోత్సహించవద్దన్నారు. విపక్షంలో వుండగా జనగ్ వెంట నడిచిన వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక తగిన గుర్తింపు లభించిందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అనుబంధ విభాగాల జిల్లా, మండల స్థాయి కమిటీలు పూర్తైన తర్వాత అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్‌ఛార్జీలతో, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశం అవుతారని ఆయన తెలిపారు.

ALso Read: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి

ఇకపోతే.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్న విజయసాయిరెడ్డి.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు. గడిచిన వారం రోజులుగా తాడేపల్లి పార్టీ కార్యాలయంలోనే విజయసాయిరెడ్డి వుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో విపక్షాలన్నీ కలిసి దాడి చేస్తుండటంతో వీటిని తిప్పికొట్టాలనే దానిపై ఆయన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.