ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదిక కూలిన ఘటనపై స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సభలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తుండగా బలమైన ఈదురుగాలులు వీశాయి. దీంతో సభావేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో వేదిక మీదున్న చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత తదితరులు కిందపడిపోయారు. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. స్టేజ్ కూలిన ఘటనపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘స్టేజ్ కూలడం బాధాకరం. వరుస అపశృతులు 2024 ఎన్నికల్లో విపక్షాల పతనానికి సంకేతాలా’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ALso Read: ఈదురు గాలులకు కుప్పకూలిన స్టేజి... టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
ఇకపోతే.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్న విజయసాయిరెడ్డి.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం తాడేపల్లి పార్టీ కార్యాలయంలోనే విజయసాయిరెడ్డి వుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో విపక్షాలన్నీ కలిసి దాడి చేస్తుండటంతో వీటిని తిప్పికొట్టాలనే దానిపై ఆయన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
