భవిష్యత్‌లో వైసీపీలో మరిన్ని చేరికలుంటాయని చెప్పారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. శనివారం విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపత్లి గణేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా జగన్ సమక్షంలో వాసుపల్లి కుమారులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు. గణేశ్ కుటుంబం విశాఖ ప్రజలకు ఎంతో సేవ చేస్తోందని.. ఆయన పార్టీలోకి రావడం వల్ల కొండంత బలం వచ్చిందన్నారు.

విశాఖ జిల్లాలో టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పథకాలను చూసి ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.

Also Read:అనర్హత పిటిషన్‌కైనా, ఎన్నికలకైనా సిద్ధమే: టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా తేడా లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రతిపక్షమే ఉండదని.. ఇక నాయకుడు ఎలా ఉంటాడని విజయసాయి ప్రశ్నించారు.

గణేశ్ మాట్లాడుతూ..తన కుమారులు వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. విశాఖలో రాజధాని ఆహ్వానించదగ్గ విషయమని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని గణేశ్ స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని... అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఇక ముందుకు వస్తోందని తనకు అనిపించడం లేదని గణేశ్ అభిప్రాయపడ్డారు.

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌‌ను ఇచ్చిన ఘనత జగన్‌దేనని వాసుపల్లి వెల్లడించారు. తన నియోజకవర్గంలో అనేక పనులన్నాయని.. అవన్నీ జగన్‌తోనే సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.