ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ భేటీ అయ్యారు. ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఈ క్రమంలో గణేశ్ ఇద్దరు కుమారులకు కండువా కప్పిన సీఎం... వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం గణేశ్ మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని వెల్లడించారు. 13 ఏళ్లుగా టీడీపీకి సేవలందించానని గణేశ్ పేర్కొన్నారు. జగన్‌కు గట్స్ ఉన్నాయని... పేదలకు ఈ స్థాయిలో సంక్షేమ  పథకాలు అందించడం టీడీపీకి సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖలో రాజధాని ఆహ్వానించదగ్గ విషయమని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని గణేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని... అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయని ఆయన వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ ఇక ముందుకు వస్తోందని తనకు అనిపించడం లేదని గణేశ్ అభిప్రాయపడ్డారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌‌ను ఇచ్చిన ఘనత జగన్‌దేనని వాసుపల్లి వెల్లడించారు.

తన నియోజకవర్గంలో అనేక పనులన్నాయని.. అవన్నీ జగన్‌తోనే సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రికి బహుమతిగా అందిస్తామని గణేశ్ చెప్పారు.

విశాఖ వాసిగా రాజధాని వస్తుందనగానే స్వాగతించానని అన్నారు. టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కోవడానికి సిద్ధమని.. అవసరమైతే ఎన్నికలకు కూడా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు