వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరులోని కార్యాలయానికి తీసుకొచ్చారు. మరోవైపు ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం హైదరాబాద్‌లోనే రెండు సీఐడీ బృందాలు మకాం వేశాయి. రాజుకు సాంకేతిక సహకారం అందించిన వారిపై ఏపీ సీఐడీ కొరడా ఝళిపించనుంది. రఘురామతో పాటు ఈ కేసుతో సంబంధం వున్న మరికొందరి పాత్రపై సీఐడీ దృష్టి పెట్టనుంది. 

కాగా, రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Also Read:రఘురామ అరెస్ట్ వెనుక కారణమిదే: ఏపీ సీఐడీ ప్రకటన

అంతకుముందు రఘురామకృష్ణంరాజును శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈమేరకు హైద్రాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ నుండి ఎంపీని ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు. 

అంతకుముందు సీఐడీ పోలీసులతో రఘురామకృష్ణమ రాజు వాగ్వివాదానికి దిగారు. సెక్యూరిటీ సిబ్బంది రఘురామ కృష్ణమ రాజు చుట్టూ వలయంగా ఏర్పడి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు అరెస్టు చేయడానికి అనుమతించబోమని వారు చెప్పారు.