వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా అరెస్టు అయ్యారా? రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అసలు జరిగిందేమిటంటే.. కువైట్‌లో ‘నవరత్నాలు’ పేరిట వైసీపీ ఓ కార్యక్రమం నిర్వహించింది.  ఈ కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. అయితే.. అక్కడ వైసీపీ నేతలు హడావిడి చేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారని... దీంతో రోజా, పలువురు పార్టీ శ్రేణులను అరెస్టు చేశారనే వార్తలు వెలువడ్డాయి. రోజాను విడిపించడానికి హైదరాబాద్ లోని పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

అయితే.. దీనిపై రోజా కువైట్‌ నుంచి వీడియో ద్వారా స్పందించారు.  ‘‘కువైట్ లో  జరిగిన ‘వైసీపీ నవరత్నాలు’ కార్యక్రమంలో నేను పాల్గొన్నా. దాదాపు రెండు వేలమంది పార్టీ శ్రేణులు హాజరయ్యారు. సమావేశం విజయవంతంగా జరిగింది. ఎక్కువ మంది ఒకేచోట సమావేశమవడంతో కువైట్‌ పోలీసులు అక్కడికి చేరుకుని అభ్యంతరం తెలిపారు. నిర్వాహకులు సర్దిచెప్పడంతో పోలీసులు శాంతించారు. ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రస్తుతం నేను దుబాయ్‌లోని మిత్రుల ఇంట్లో ఉన్నా’’ అని రోజా స్పష్టం చేశారు. తనను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తనను కువైట్‌ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయని మిత్రులు ఫోన్‌ చేసి చెప్పడంతో తాను స్పందించినట్లు రోజా వివరించారు.