తిరుపతి: కరోనా బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇలా కరోనా చికిత్స పొందుతూనే రాజకీయ విమర్శలకు సైతం తనదైన శైలిలో జవాభిస్తున్నారు. ఇలా కరోనా సోకి ఇబ్బందుల్లో వున్నప్పటికి తన వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని, ప్రజా సంబంధమైన రాజకీయాలను ఏకకాలంలో సాగిస్తున్నారు. 

''జగన్ రెడ్డి గారూ..దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని కోరిన భూమన కరుణాకరరెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా? తక్షణమే ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోని ప్రజలకు క్షమాపణ చెప్పాలి'' అంటూ మొదట బిజెపి ఏపీ ఇంచార్జీ సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు. 

 

ఈ ట్వీట్ పై స్పందిస్తూ  ఎమ్మెల్యే భూమన ఓ ప్రకటన విడుదల చేశారు. విరసం నేత వరవరరావు ను విడుదల చేయాలని తాను ఉపరాష్ట్రపతికి లేఖ రాయడం తన వ్యక్తిగతమని... దాన్ని ముఖ్యమంత్రి జగన్ కు ముడిపెట్టడం తగదని భూమన అన్నారు. క్షమాగుణం, ఆపదలో వున్న మనిషికి సాయం చేయాలని భారతీయ సంస్కృతి నేర్పిందని... దాన్ని పాటించడమే నేరమయితే అది తాను చేస్తూనే వుంటానంటూ భూమన కాస్త ఘాటుగానే దేవదర్ ట్వీట్ పై రియాక్ట్ అయ్యారు. 

అయితే కరోనా సోకడంతో భూమన ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం భూమనకు ఫోన్ చేసిన జగన్ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.తాను క్షేమంగానే ఉన్నానని ముఖ్యమంత్రికి వివరించారు. భూమన త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. 

read more  నూతన్ నాయుడికి వైసీపీతో లింక్, అందుకే...: నక్కా ఆనందబాబు

వైసీపీలో ఒకరి వెంట ఒకరు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సీఎం పర్యటించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతలు, మీడియా సిబ్బందికి అధికారులు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. 

 ఈ క్రమంలో అవినాశ్ రెడ్డికి పాజిటివ్‌గా తేలడంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో అవినాశ్‌తో కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్న వారిలో ఆందోళన నెలకొంది. ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు నేతలు కరోనా బారినపడ్డారు.

ఆదివారం కూడా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.