నర్సాపురం ఎంపీ  రఘురామకృష్ణంరాజుకు బుధవారం నాడు వైసీపీ నాయకత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలపై  చేసిన  విమర్శలకు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య ఇటీవల కాలంలో పరస్పరం విమర్శలు చేసుకొన్నారు.  

also read:రక్షణ కల్పించండి: ఎస్పీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు వినతి

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ప్రజల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను  అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా తనకు దక్కలేదన్నారు. ఇదే విషయాన్ని ఆయన కొన్ని టీవీ చానల్స్ చర్చల సందర్భంగా చెప్పారు.

ఈ వ్యాఖ్యలను వైసీపీ సీరియస్ గా తీసుకొంది. నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు  ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ దయతోనే ఎంపీగాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్  పదవిని దక్కించుకొన్నారని ఆయన ఆరోపించారు.

ఈ విమర్శలపై రఘురామకృష్ణంరాజు అదే స్థాయిలో స్పందించారు. తన వల్లే తన నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు. జగన్ బొమ్మవల్ల తాను విజయం సాధించలేదన్నారు. తనను బతిమిలాడితేనే పార్టీలో చేరినట్టుగా ఆయన ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీకి చెందిన ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎంపీని కోరారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ మరో వైపున విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నారు. 

రఘురామకృష్ణంరాజు కామెంట్స్ పై పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన క్యాడర్ దిష్టిబొమ్మలు దగ్దం చేశారు.  ఈ విషయమై రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తాను జిల్లాలో పర్యటిస్తే తనపై దాడి చేస్తారని బెదిరింపులకు పాల్పడ్డారని కూడ ఆయన ఆరోపించారు. 

జిల్లాలో పర్యటించే సమయంలో భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.  అంతేకాదు ఇదే విషయమై పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకు కూడ ఆయన లేఖ రాశాడు. ఈ  లేఖను స్పీకర్ కేంద్ర హోం శాఖకు పంపినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలపై చేసిన విమర్శలపై వారం రోజుల్లోపుగా సమాధానం చెప్పాలని రఘురామకృష్ణంరాజుకు ఇవాళ వైసీపీ నాయకత్వం షోకాజ్ నోటీసు పంపింది. ఈ షోకాజ్ పై ఎంపీ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.