నరసాపురం:నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలకు,ఎంపీ రఘురామకృష్ణంరాజుకు  మధ్య అగాధం మరింత పెరిగిపోతోంది.

ఎంపీకి రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజు వ్యక్తిగత కార్యదర్శి కృష్ణవర్మ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని కోరారు.ఈ మేరకు ఆయన ఎస్పీని కలిసి ఇవాళ లేఖను సమర్పించారు. నియోజకవర్గంలో ఎంపీ పర్యటిస్తే దాడులు చేస్తారని  విమర్శలు చేసిన విషయాన్ని ఎస్పీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దగ్దం చేయడంతో పాటు తీవ్ర స్థాయిలో దూషించారని ఆయన గుర్తు చేశారు.ఎంపీ దిష్టిబొమ్మ దగ్దం చేసిన వైసీపీ కార్యకర్తలు, నేతలపై చర్యలు తీసుకోవాలని ఉండి, ఆచంట, ఆకివీడు, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ  నలుగురు ఎస్ఐలపై కూడ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఎస్పీని కోరారు.జిల్లాలో ఎంపీ పర్యటించిన సమయంలో రక్షణ కల్పించాలని ఆయన ఎస్పీని కోరారు. 

ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్స్ పై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ బొమ్మతోనే రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచాడని చెప్పారు.

ఈ వ్యాఖ్యలతో రఘురామకృష్ణంరాజు విభేదించారు. తన వల్లే తాను విజయం సాధించినట్టుగా ఆయన చెప్పారు. జగన్ కారణంగా తనకు పార్లమెంటరీ పార్టీ చైర్మెన్ పదవి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

also read:కాళ్లా వేళ్లా పడితేనే వైసీపీలోకి, నాపై విమర్శలతో మంత్రి పదవి: రఘురామకృష్ణంరాజు సంచలనం

దీంతో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు రఘురామకృష్ణంరాజుపై ఈ నెల 16న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు. దీంతో ఎంపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.