అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైసిపి ఎంఎల్ఏలు విరుచుకుపడ్డారు. స్పీకర్ చంద్రబాబునాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎంఎల్ఏలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు బుధవారం ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేయటానికి అసెంబ్లీకి వెళ్ళారు. అయితే, స్పీకర్ లేకపోవటంతో డిప్యుటి కార్యదర్శికి ఫిర్యాదును అందచేశారు.

అదే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్, చంద్రబాబునాయుడు తొత్తులాగ మారిపోయినట్లు విరుచుకుపడ్డారు. రాజ్యసభలో ఓ పార్టీ సభ్యుడు మరో పార్టీ ర్యాలీలో పాల్గొన్నందుకే అనర్హునిగా ప్రకటించిన విషయం స్పీకర్ కు తెలీదా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీనే కదా ఇక్కడ భాగస్వామ్య పార్టీ అంటూ గుర్తుచేశారు. కేంద్రంలో ఓ నీతి, రాష్ట్రంలో ఓ నీతా అంటూ నిలదీశారు.

ఇప్పటి వరకూ 22 మంది ఎంఎల్ఏలు ఫిరాయిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాలని తాము ఫిర్యాదు చేసినా స్పీకర్లో చలనంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజ్యసభ విధానంలోనే అసెంబ్లీలో కూడా ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలంటూ ఆళ్ళ డిమాండ్ చేశారు.