కర్నూల్ కు సీబీఐ మరో టీమ్: విశ్వభారతి ఆసుపత్రి వద్దే వైసీపీ శ్రేణులు
కర్నూల్ కు మరో సీబీఐ బృందం ఇవాళ ఉదయం చేరుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
కర్నూల్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆసుపత్రి ముందే వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. ఇదిలా ఉంటే కర్నూల్ కు మరో సీబీఐ బృందం మంగళవారంనాడు ఉదయం చేరుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న వికాస్ సింగ్ మాత్రం కర్నూల్ లోనే ఉన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. తల్లికి అనారోగ్యంగా ఉందని ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందులకు వైఎస్ అవినాష్ రెడ్డి వెళ్లారు. మార్గమధ్యలో తాడిపత్రి నుండి తల్లి శ్రీలక్ష్మిని తీసుకుని కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రికి వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. విశ్వభారతి ఆసుపత్రిలో తల్లి శ్రీలక్ష్మిని చేర్పించారు. . తల్లి అనారోగ్యం గురించి సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి సమాచారం ఇచ్చారు.
ఈ నెల 22న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే తల్లి అనారోగ్య కారణాలతో ఈ నెల 27వ తేదీ వరకు విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. మరో వైపు సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.
నిన్ననే కర్నూల్ కు సీబీఐ బృందం చేరుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన బందోబస్తు ఇవ్వాలని కర్నూల్ ఎస్పీని సీబీఐ బృందం కోరింది. అయితే డీజీపీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని కర్నూల్ ఎస్పీ సీబీఐ బృందానికి సమాచారం ఇచ్చారు. నిన్న రాత్రి కర్నూల్ కు వచ్చిన సీబీఐ బృందం హైద్రాబాద్ కు వెళ్లిపోయింది. మంగళవారంనాడు ఉదయం మరో సీబీఐ బృందం హైద్రాబాద్ కు చేరుకుంది.
విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే అనుమానంతో ఆసుపత్రి వద్దే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలున్నారు. రాత్రి ఆసుపత్రి ముందే వైసీపీ శ్రేణులు జాగారం చేశాయి
also read:విశ్వభారతి ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి: విజయమ్మ పరామర్శ
ఆసుపత్రి వద్ద ఉన్న వైసీపీ శ్రేణులకు అల్పాహరం, భోజనం వంటి సదుపాయాలను వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ఏర్పాటు చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి వికాస్ సింగ్ కర్నూల్ పోలీస్ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. సీబీఐ ఏం చేస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.