YS Jagan: వైసీపీ అధినేత జగన్‌పై పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచింది జగనేనని ఆరోపించారు. వైసీపీని వీడటానికి గల కారణాలను ఢిల్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.?
జగన్ రాజీనామాకు అదే కారణం
వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశించారని, అయితే కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు అంగీకరించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవిని కూడా వదులుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తన ఆత్మకథలో కూడా ప్రస్తావించారని విజయసాయిరెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తనను వెన్నుపోటుదారుడని విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
వైసీపీలో తనకు జరిగిన అవమానాలివే..
వైఎస్ కుటుంబానికి సుమారు 40 ఏళ్లుగా సేవలు అందించానని విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ నిర్మాణం, పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డానని, జగన్‌తో పాటు ఏడాది పాటు జైలు జీవితం కూడా గడిపానని చెప్పారు. తన సేవలు, కష్టాన్ని గుర్తించిన తర్వాతే పార్టీలో కీలక స్థానం కల్పించారని వివరించారు. అయితే రానురాను పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన తనను కీలక బాధ్యతల నుంచి తప్పించారని చెప్పారు. పార్టీ వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేయాలని చెప్పడాన్ని అవమానంగా భావించానన్నారు. 2023 చివరిలో బీజేపీ కేంద్ర నాయకుల అపాయింట్మెంట్లు కోరిన విషయాన్ని సాకుగా చూపి తన బాధ్యతలను తొలగించారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని, పార్టీ లోపల ఏం జరుగుతుందో ఆయనకు పూర్తిగా తెలియకుండా చేస్తున్నారని విమర్శించారు.
ఏపీలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా పీఆర్పీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు ప్రధాన రాజకీయ కుటుంబాల ఆధిపత్యంలో పార్టీలు కొనసాగుతున్నాయని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మరో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని, ఆ లోటును తమ పరివర్తన రాజనీతి పార్టీ భర్తీ చేస్తుందని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో 66 శాతం టికెట్లను యువతకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. జెన్‌జీ యువతను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తామని చెప్పారు. తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ అనుసరించిన కొన్ని విధానాలను ఆదర్శంగా తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత తమ పార్టీలో చేరే నాయకుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. వైసీపీలోనూ పలువురు అసంతృప్తితో ఉన్నారని, భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితిని ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.
ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
కొత్త రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. గ్రామం నుంచి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఏపీలో సుమారు 5 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోందని, ఈ నీటిని సమర్థంగా వినియోగించుకునేలా రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెడతామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. 2019-2024 మధ్య రాష్ట్రంలో మత మార్పిడులు పెరిగాయని ఆరోపించారు. ఎవరైనా తమ ఇష్టానుసారం మతాన్ని ఆచరించవచ్చని, అయితే బలవంతపు మత మార్పిడులకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.
మత వివక్ష, వైఎస్ కుటుంబ ఆస్తులపైనా వ్యాఖ్యలు
రాష్ట్రంలో హిందువులు వివక్షకు గురవుతున్నారని, ఈ కారణంగా కొందరు మత మార్పిడులకు పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కులాల ఆధారంగా చర్చిలు నిర్మిస్తున్నారని, కొన్ని చోట్ల నిర్దిష్ట సామాజికవర్గాల వారికే ప్రవేశం ఉంటోందని ఆరోపించారు. కల్వరి టెంపుల్స్ ఏర్పాటుతో పాటు మతపరమైన అంశాలపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేవాలయాల ఆదాయాన్ని ఆలయ నిర్వహణ, పూజారుల అవసరాలకు వినియోగిస్తున్నప్పుడు మసీదులు, చర్చిలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకాల అంశం జగన్, షర్మిల మధ్య ఉన్న వ్యక్తిగత వ్యవహారమని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన అంతర్గత విషయాలు తనకు, కేవీపీ రామచంద్రరావుకు మాత్రమే తెలుసని, అన్ని విషయాలు తెలిసినప్పటికీ వాటిని బహిరంగంగా వెల్లడించడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలే అజెండాగా పీఆర్పీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
















