అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మార్చి 21లోపు కూడా కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెట్టటానికి సిద్ధమన్నారు. కేంద్రంలోని టిడిపి మంత్రుల రాజీనామాలు చేస్తారన్న చంద్రబాబునాయుడు ప్రకటనపై వైఎస్ జగన్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలోని సంతరావురులో జగన్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు.

అరుణ్ జైట్లీ స్టేట్మెట్లో కొత్తేమీ లేదన్నారు. గతంలో జైట్లీ చేసిన ఇదే ప్రకటనను చంద్రబాబునాయుడు స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేకహోదాపై   జైట్లీ ఇపుడే కొత్తగా మాట్లాడినట్లు చంద్రబాబు ఓవర్ యాక్ట్ అయినట్లు మండిపడ్డారు. కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారని చెప్పటం ‘జనాల విక్టరీ’ మాత్రమే అన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి, వైసిపి రాజీనామాల ఒత్తిడికి చంద్రబాబు లొంగిపోయినట్లు ప్రకటించారు. అందుకే వేరేదారి లేక కేంద్రంలోని టిడిపి మంత్రుల రాజీనామాలు ప్రకటించినట్లు జగన్ అభిప్రాయపడ్డారు.

ఏదేమైనా ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు తల ఒగ్గటం సంతోషంగా ఉందన్నారు. కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించాలని అనుకున్న తర్వాత ప్రధానికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీఏలో చంద్రబాబు కొనసాగటంలో అర్ధమేంటంటూ నిలదీశారు. రాజకీయాల్లో క్రెడిబులిటి, విలువలు చాలా అవసరమన్నారు. చంద్రబాబుకు ఇవేవీ లేవు కాబట్టే రోజుకో మాట మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మార్చి 21వ తేదీన వైసిపి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంకు టిడిపి మద్దతు ఇవ్వాలంటూ జగన్ చెప్పారు. మొత్తం 25 మంది ఎంపిలు ఒకేతాటిపై నిలబడాలన్నారు. చంద్రబాబు కలసివస్తే మార్చి 21కన్నా ముందే అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టటానికి కూడా సిద్ధమేనన్నారు. 21 తర్వాత 25 మంది ఎంపిలు రాజీనామాలు చేయాలని కూడా సూచించారు. అప్పుడే దేశమంతా ఏపి వైపు చూస్తుందన్నారు. ఏపి సమస్యలను ఇతర రాష్ట్రాలతో పోల్చుతున్న కేంద్ర వైఖరిని కూడా జగన్ తప్పుపట్టారు.