పరిటాల కోటలో జగన్ పాదయాత్ర సక్సెస్

పరిటాల కోటలో జగన్ పాదయాత్ర సక్సెస్

పరిటాల కోటలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బాగా సక్సెస్ అయినట్లే. సొంత జిల్లా కడప కంటే కూడా కర్నూలు జిల్లా, అంతకు మించి అనంతరపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర జోరుగా సాగుతోంది. నిజానికి అనంతపురం జిల్లాలో వైసిపి పోయిన ఎన్నికల్లో బాగా దెబ్బతింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది కేవలం 2 చోట్ల మాత్రమే. అందులో కూడా కదిరి ఎంఎల్ఏ చాంద్ భాష్ టిడిపిలోకి ఫిరాయించారు. దాంతో జిల్లా వ్యాప్తంగా వైసిపికి ప్రజాప్రతినిధల బలం పెద్దగా లేదనే చెప్పాలి.

అటువంటి పరిస్ధితిలో అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే ముందు వైసిపిలో పాదయాత్ర విజయవంతమవ్వటంపై అనుమానాలుండేవి. అయితే, కర్నూలు జిల్లా ద్వారా అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించే సమయానికి అనుమానాలు తొలగిపోయాయి. తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో అయితే, ఊహించని జన స్పందన కనబడటంతో వైసిపిలో ఉత్సాహం స్పష్టంగా కనబడింది. దానికి తోడు బహిరంగ సభ కూడా సక్సెస్ అవ్వటంతో వైసిపిలో రెట్టించిన ఉత్సాహం కనబడింది.

అదే ఊపులో జగన్ శింగనమల నియోజకవర్గం తర్వాత రాప్తాడులోకి ప్రవేశించారు. రాప్తాడు నియోజకవర్గమంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిటాల కంచుకోట ఇది. ప్రస్తుతం పరిటాల రవి భార్య పరిటాల సునీత మంత్రిగా ఉన్నారు. దానికితోడు ఇదే నియోజకవర్గానికి చెందిన వైసిపి బిసి నేత హత్యకు జరిగిన కుట్ర ఈ మధ్యనే బయటపడింది. ఒకవిధంగా జిల్లా మొత్తంతో పోల్చుకుంటే రాప్తాడులోనే టిడిపి-వైసిపి మధ్య నిత్యం దాడులు జరుగుతున్నాయి.

ఇటువంటి నేపధ్యంలోనే జగన్ పాదయాత్ర ఎలా జరుగుతుందో అని సర్వత్రా ఉత్కఠ మొదలైంది. అయితే, యాత్ర ప్రారంభమైన తర్వాత అనుమానాలన్నీ తొలగిపోయాయి. తాడిపత్రికి మించిన ప్రజాస్పందన రాప్తాడులో కనబడుతోందని వైసిపి నేతలు సంబరపడుతున్నారు. జిల్లాలో ఒక పార్లమెంటు సీటుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని బిసి అభ్యర్ధులకు దక్కే అవకాశం ఉండటంతో నేతల్లో కూడా ఉత్సాహం స్పష్టంగా కనబడుతోంది. అందుకే జగన్ పాదయాత్రకు అంత ఊపు కనబడుతోందని వైసిపి నేతలంటున్నారు. మధ్యాహ్నంపైన ఈ నియోజకవర్గంలోనే బహిరంగ సభ కూడా జరుగనున్నది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos