వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఒకవైపు పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడుపై తాను ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ వేదికగా చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసే బాధ్యతను ఎంపిలకు అప్పగించారు. దాంతో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి రెచ్చిపోతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్, తదనంతర పరిణామాలను జగన్ బాగా ఉపయోగించుకుంటున్నారు.

85 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జగన్ రాయలసీమలో తన పర్యటన పూర్తి చేసుకుని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో బిజిగా ఉన్నారు. జనాల స్పందన బాగుంది. అక్కడక్కడ టిడిపికి చెందిన కీలక నేతలు వైసిపిలో చేరుతున్నారు. అదే సమయంలో ఒకరిద్దరు వైసిపి నేతలు కూడా టిడిపిలో చేరారులేండి. మొత్తం మీద తన పాదయాత్రలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు జనాలు కూడా బాగానే స్పందిస్తున్నారు.

అదే సమయంలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. తాజా బడ్జెట్లో ఏపి ఆశించినవి ఏమీ లేవు. దాంతో జనాలు, రాజకీయ పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి. జనాగ్రహాన్ని గమనించిన చంద్రబాబు కూడా కేంద్రంపై పోరాటం చేయాలంటూ ఎంపిలను ఆదేశించారు. పార్లమెంటు వేదికగా టిడిపి ఎంపిలు ఒక్కసారిగా కేంద్రానికి వ్యతిరేకంగా స్వరం పెంచారు.

దాంతో ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అప్పటికే ఏపి ప్రయోజనాల కోసం అనేక పోరాటాలు చేసిన వైసిపి ఎంపిలు ఒకవైపు కేంద్రాన్ని తప్పుపడుతూనే మరోవైపు టిడిపిని లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్రప్రభుత్వంలో భాగస్వామైన టిడిపి బడ్జెట్ పై నాటకాలాడుతోందంటూ వైసిపి ఎంపిలు ధ్వజమెత్తుతున్నారు. అలాగే, వచ్చే నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి, కేంద్ర ఎన్నకల కమీషన్, ఉపరాష్ట్రపతి తదితరులను విజయసాయిరెడ్డి కలిసారు. ఎంఎల్ఏల ఫిరాయింపులు, ఎంఎల్ఏల కొనుగోళ్ళు, వైసిపి ఎంఎల్ఏలపై కేసులు పెడుతున్న చంద్రబాబుపై ఫిర్యాదులు చేశారు.

అంటే, చంద్రబాబుపై జగన్ ఒకేసారి మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో తాను స్వయంగా పోరాటం చేస్తూ ఢిల్లీ పోరాడే బాధ్యతను ప్రధానంగా విజయసాయిపై మోపారు.