చినరాజప్ప కుమారుడిపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు

Ys jagan Fires on chandrababu naidu at peddapuram
Highlights

హోంమంత్రి చినరాజప్పపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చినరాజప్ప జిల్లాలోనే శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. ఇటీవల పెద్దాపురం పరిసరాల్లో ఆరు హత్యలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. 

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్దాపురంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్లతో కమీషన్ గురించి మాట్లాడేందుకే ముఖ్యమంత్రి ప్రతి సోమవారం పోలవరం వెళుతున్నారని... ప్రాజెక్ట్‌లో అంతులేని అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవినీతి కారణంగా పోలవరం పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు.

రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని... ప్రతి పనిలో అవినీతి జరుగుతోందన్నారు. ఇసుక, మట్టి, రాజధాని, భోగాపురం ఎక్కడా చూసినా దోచేస్తున్నారని.. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో మాఫియా నడుస్తోందని వైసీపీ అధినేత అన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని నాలుగేళ్ల కాలంలో ఆరు హత్యలు జరిగాయని వెల్లడించారు.

హోంమంత్రి చినరాజప్పపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చినరాజప్ప జిల్లాలోనే శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. ఇటీవల పెద్దాపురం పరిసరాల్లో ఆరు హత్యలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. 

ఆనూరుమెట్ట గ్రావెల్‌ మాఫియా వెనుక చినరాజప్ప, ఆయన తనయుడి ప్రమేయం ఉందని ఆరోపించారు. మంత్రి యనమల వియ్యంకుడికి పోలవరం కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పారు. 

పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలు కాలువల్లో కలుస్తున్నాయి.. ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు.. ఆరోగ్య శ్రీ పడకేసిందని.. ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి టీడీపీ పాతరేసిందని దీని వల్ల ఎంతోమంది తల్లిదండ్రలు అప్పుల పాలైపోయారని జగన్ తెలిపారు.

పేదలకి కేటాయించిన స్థలాలను టీడీపీ ప్రభుత్వం లాక్కొని.. వారికి ఫ్లాటును రూ. 6 లక్షలకు విక్రయిస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పేదలు కట్టాల్సిన రూ.3 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని... డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళలు చెల్లించాల్సిన రుణాన్ని నాలుగు విడతలుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని.. పక్కా ఇళ్లు కట్టించి వాటిని ఆడపడుచుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని.. మద్యం షాపులు లేకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ దగ్గరకి వచ్చి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానంటారని ఆయన మాటలు నమ్మవద్దని.. మనస్సాక్షిని నమ్మి ఓటేయాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాన్న ప్రజల కోసం ఒకడుగు ముందుకేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానని.. వైఎస్ ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా పరిపాలన చేస్తానని ప్రకటించారు.

loader