పేదలకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నారని అంటూనే తాము అధికారంలోకి వస్తే అప్పనంగా మింగేసిన భూములన్నింటినీ తిరిగి కక్కిస్తామని జగన్ హామీ ఇచ్చారు. టిడిపి నేతలున్న భూముల వద్దనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నేతల భూముల విలువలు పెరగటానికి సాయం చేస్తున్నట్లు ఆరోపించారు.
తెలుగుదేశంపార్టీ నేతల భూకుంభకోణంలో నిజాలు వెలుగు చూడాలంటే సిబిఐ విచారణ చేయించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసారు. గురువారం మధ్యాహ్నం జరిగిన మహాధర్నాలో ప్రసంగించారు. విశాఖపట్నంలో భూమాఫియా కాజేసిన ప్రతీ ఎకరాన్ని తిరిగి కక్కిస్తానని జగన్ హామీ ఇచ్చారు. పేదలకు ఒక్క అంగుళం భూమి కూడా నష్టం జరగకుండా వైసీపీ పోరాటాలు చేస్తుందన్నారు. లక్ష కోట్ల రూపాయల విలువైన వేలాది ఎకరాలను ముఖ్యమంత్రి, నారా లోకేష్, మంత్రులు, అధికారులు ఒక మాఫియాలా తయారై భారీ భూకుంభకోణానికి పాల్పడినట్లు జగన్ ధ్వజమెత్తారు. లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులు, 16,375 ల్యాండ్ మెజరమెంట్ బుక్స్ కనిపించటం లేదని కలెక్టర్ చెప్పటం దేనికి నిదర్శనమని జగన్ ప్రభుత్వాన్ని నిలదీసారు.
ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు చివరకు అసైన్డ్ భూములను కూడా వదలకుండా టిడిపి నేతలు కబ్జా చేసారని మండిపడ్డారు. తాను విశాఖపట్నంకు వస్తున్నట్లు తెలిసి ఆన్ లైన్లో కొన్ని పేర్లను సర్దబాటు చేసారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు వైఖిరికి నిరసనగానే తాను ఈరోజు భారీ ధర్నా చేస్తున్నట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు బంధువు ఎంవివిఎస్ మూర్తి 55 ఎకరాలను కబ్జా చేసి సొంతం చేసేయమంటే వెంటనే ఆయనకు చంద్రబాబు రాసిచ్చేసినట్లు మండిపడ్డారు.
డబ్బు ఆశ చూపి అసైన్డ్ భూములను లాక్కున్నారని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఇవ్వటానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్లో నుండి రాత్రికి రాత్రే రోడ్లు వేసేసినట్లు ఆరోపించారు. ముఖ్యులతో పాటు స్ధానికంగా ఉన్న 35 మంది టిడిపి నేతలు వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నట్లు ధ్వజమెత్తారు. మాజీ సైనికుల భూములను కూడా వదిలిపెట్టటం లేదన్నారు. చివరకు భాజపా శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు భూములను కూడా టిడిపి నేతలు వదిలిపెట్టలేదని ఎద్దేవా చేసారు.
భూ రికార్డులన్నీ హుద్ హుద్ తుఫానులో కొట్టుకుపోయాయని కలెక్టర్ కతలు చెబుతున్నారని మండిపడ్డారు. సొంతం చేసుకున్న ప్రభుత్వ భూములను గంటా గ్యాంగ్ బ్యాంకుల్లో పెట్టి కోట్లాది రూపాయలు రుణాలు తీసేసుకుంటున్నారని చెప్పారు. పేదలకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నారని అంటూనే తాము అధికారంలోకి వస్తే అప్పనంగా మింగేసిన భూములన్నింటినీ తిరిగి కక్కిస్తామని జగన్ హామీ ఇచ్చారు. టిడిపి నేతలున్న భూముల వద్దనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నేతల భూముల విలువలు పెరగటానికి సాయం చేస్తున్నట్లు ఆరోపించారు.
