Asianet News TeluguAsianet News Telugu

షాతో భేటీ తర్వాత కేంద్రమంత్రులు షాక్: ఢిల్లీ నుంచి వెనుదిరిగిన జగన్

కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం జగన్  కు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  సీఎం జగన్ 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు.

ys jagan delhi tour: union ministers cancels their appointments, jagan returns to ap
Author
New Delhi, First Published Oct 22, 2019, 2:11 PM IST

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. కేంద్రమంత్రులు జగన్ కు షాక్ ఇచ్చారు. అపాయింట్మెంట్స్ రద్దు చేయడంతో జగన్ విశాఖకు బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొంది. 

సీఎం జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నాం 12 గంటలకు సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. అప్పటి నుంచి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, ఐటీ, కమ్యూనికేషన్స్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంట్ వ్యవహారాలు, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అవ్వాలనుకున్నారు. 

వాస్తవానికి సీఎం జగన్ సోమవారం మధ్యాహ్నమే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాలనుకున్నారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి భంగపడటంతో ఢిల్లీలోని తన అధికారిక నివాసమైన 1-జన్ పథక్ కే పరిమితం కావాల్సి వచ్చింది. 

అయితే మంగళవారం సీఎం జగన్ కు అపాయింట్మెంట్లు ఖరారు అయ్యాయి. ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు చేశారు. దాంతో సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. 

అయితే 12.30 గంటలకు ఐటీ కమ్యూనికేషన్స్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ కావాల్సి ఉంది. అమిత్ షా పర్యటన అనంతరం ఆయనను కలవాల్సి ఉండగా ఆకస్మాత్తుగా అపాయింట్మెంట్ రద్దు అయ్యింది. 

దాంతో జగన్ తిరిగి 1 జన్ పథ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇకపోతే 3 గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా భేటీ కావాల్సి ఉంది. ఆ అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది. 

దాంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసినట్లైంది. దాంతో వెనువెంటనే సీఎం జగన్ విశాఖపట్నం బయలుదేరుతున్నట్లు సమాచారం. రాత్రి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు సీఎం జగన్. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లిలోని తన స్వగృహానికి చేరుకుంటారు. 

ఇకపోతే జగన్ కు ఇచ్చిన అపాయింట్మెంట్స్ ను కేంద్రమంత్రులు రద్దు చేశారా లేక జగనే రద్దు చేసుకున్నారా అన్నఅంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. సీఎం జగనే కేంద్రమంత్రులతో అపాయింట్మెంట్స్ రద్దు చేసుకున్నారంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. 

సోమవారం అంతా ఢిల్లీలోనే ఉండి ఒక్కరిని కూడా కలవలేదు సీఎం జగన్. మంగళవారం కేంద్రమంత్రులు అపాయింట్మెంట్స్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే కేంద్రహోంశాఖ మంత్రితో భేటీ అనంతరం ఏదైనా జరిగిందా అన్న సందేహాలు నెలకొన్నాయి. 

కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం జగన్  కు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  సీఎం జగన్ 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. భేటీ అనంతరం అపాయింట్మెంట్స్ అన్నీ రద్దు కావడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.  

ఈ వార్తలు కూడా చదవండి

అమిత్ షా తో భేటీ: హోదాతోపాటు వైయస్ జగన్ చిట్టా ఇదీ..

ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ: అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ.. 

జగన్ పై అమిత్ షా గుస్సా: రెండుసార్లు నో అపాయింట్మెంట్, కానీ

Follow Us:
Download App:
  • android
  • ios