న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో కేంద్రం విబేధిస్తోందా....? కేంద్రం వద్దన్నా జగన్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లడంపై గుర్రుగా ఉందా...? పీపీఏల పున:సమీక్ష అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించినప్పటికీ జగన్ వెనకడుగు వేయకపోవడంతో అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారా....?

కేంద్రం యెుక్క అభిమతానికి జగన్ భిన్నంగా వ్యవహరించడమే అందుకు కారణమా..ఇప్పటికే రెండుసార్లు తన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం అదేనా....సీఎం జగన్ పై అమిత్ షా గుస్సా వెనుక కారణాలు ఏంటి....

అమిత్ షాతో భేటీ కోసం సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో తిష్ట వేసినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక మర్మం ఏంటి....? బీజేపీ ఎంపీలకు దొరికిన అపాయింట్మెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు దొరకలేదు. 

ఇవే ప్రశ్నలపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసేందుకు సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నాం అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

సోమవారం మధ్యాహ్నాం అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలియడంతో ముఖ్యమంత్రి జగన్ హస్తిన బయలుదేరారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా తన అధికారిక నివాసమైన 1-జనపథ్ కు చేరుకున్నారు. 

అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. కానీ లభించలేదు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వేచి చూసినప్పటికీ షా దర్శనభాగ్యం జగన్ కు లభించ లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్లు మంగళవారం అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. 

మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు చేశారు. ఇకపోతే సోమవారం సీఎం జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై చాలా ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

గతంలో కూడా హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ప్రధాని నరేంద్రమోదీని మాత్రమే కలిశారు. అనంతరం అక్కడ నుంచి తాడేపల్లి వచ్చేశారు. 

ఆ తర్వాత అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందనుకున్న తరుణంలో ఆకస్మాత్తుగా క్యాన్సిల్ అయ్యింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లడంతో అపాయింట్మెంట్ రద్దైందని ప్రచారం జరిగింది. 

ఇకపోతే సోమవారం మాత్రం ఢిల్లీలోనే ఉన్నారు హోంమంత్రి అమిత్ షా. అంతేకాదు పలువురితో భేటీ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిద్ సైతం అమిత్ షాతో భేటీ అయ్యారు. కానీ జగన్ కు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 

తన పార్టీకి చెందిన ఎంపీకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో ఉండికూడా ఇవ్వకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.  

జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఆయన వ్యవహర శైలియే కారణమంటూ ప్రచారం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయడం, సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల విషయంలో కేంద్రం అభిమతానికి భిన్నంగా జగన్‌ పున:సమీక్షకు నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారట షా. 

పీపీఏ పున:సమీక్షల వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని స్వయంగా కేంద్రమంత్రి ఆర్కే సింగ్, కేంద్ర ఇంధనవనరుల శాఖ కార్యదర్శి సైతం లేఖలు రాసినా జగన్ మాత్రం వెనకడుగు వేయలేదు. పున:సమీక్షలకే మెుగ్గు చూపిన సంగతి తెలిసందే.  

విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌లు ఇవ్వకపోతే ఎక్స్ఛేంజీల్లో కరెంటు కొనుగోలుకు అవకాశం ఇవ్వరాదన్న కేంద్ర ఉత్తర్వులపై జగన్‌ సర్కారు హైకోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ ప్రచారం జరుగుతుంది.  

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ: అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ