న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. 

అమిత్ షాకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని సమస్యలపై అమిత్ షా వద్ద ఏకరువు పెట్టారు సీఎం జగన్. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టంలోని పొందుపరిచిన హామీలను అమలు చేయాలని అమిత్ షాను కోరారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలపై అమిత్ షాకు వివరించారు సీఎం జగన్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన రివర్స్ టెండరింగ్, పీపీఏల పున:సమీక్ష వంటి అంశాలపై సీఎం జగన్ అమిత్ షాకు వివరించనున్నారు. 

అలాగే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని దానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి సహకరించాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ అమిత్ షాకు వివరించారు. 

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులపాలయ్యిందని అమిత్ షాకు వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికలోటుతో సతమతమవుతుందని కేంద్రం సహకరించాలని కోరారు. 

ఇకపోతే మధ్యాహ్నాం 12.30 గంటలకు ఐటీ కమ్యూనికేషన్ వ్యవహారాల శాఖ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. 

అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన, న్యాయపరమైన అంశాలపై కూడా కూలంకుషంగా చర్చించనున్నారు. అలాగే జ్యూడిషియల్ కమిటీ ఏర్పాటు అంశంపై కూడా జగన్ వివరణ ఇవ్వనున్నారు. 

మరోవైపు మధ్యాహ్నాం 3గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సీఎం జగన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం జగన్ కోరనున్నారు. 

ఇకపోతే ఢిల్లీ పర్యటన అనంతరం సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం బయలుదేరునున్నారు. విశాఖపట్నంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. అక్కడ నుంచి రాత్రి 9 గంటలకు తాడేపల్లిలోని తన స్వగృహానికి సీఎం జగన్ చేరుకుంటారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీకి సీఎం: రాత్రికి హస్తినలోనే జగన్ బస